రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS) వ్యవహారంపై కాంగ్రెస్ నేతల మండిపడుతున్న సంగతి తెలిసిందే.. అదీగాక ప్రభుత్వం ఏర్పడి వందరోజులు కూడా దాటలేదు.. అప్పుడే విమర్శల దాడికి దిగిన బీఆర్ఎస్ నేతలు.. పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారనే అపవాదు మూటగట్టుకొంటున్నారని టాక్.. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు సైతం సమీపిస్తుండటంతో కారు స్టీరింగ్ జామ్ అయ్యి.. చిన్న పెద్ద నేతలంతా పక్క పార్టీలోకి వలస బాట పట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖాళీ అవుతున్న గులాబీకి నిజామాబాద్ (Nijamabad) జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఎడపల్లి జెడ్పీటీసీ , జిల్లా వైస్ చైర్ పర్సన్ రజిత యాదవ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకొన్నారు. గతంలో కాంగ్రెస్‌కు చెందిన రజిత,ఎల్లయ్య యాదవ్ దంపతులు బీఆర్ఎస్‌లో చేరి జెడ్పీటీసీగా గెలిచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అండతో జెడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకొన్నారు.
మరోవైపు బోధన్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్‌కు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, నాయకులు అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక పార్టీ మారాలనుకొంటున్న నేతలు ఇప్పటికే సుదర్శన్ రెడ్డి తో చర్చించారని తెలుస్తోంది.
మరోవైపు కంట్రోల్ తప్పిన కారులోంచి రంగారెడ్డి (Rangareddy) జిల్లా కీలక నేత దిగడానికి సిద్దం అయినట్లు సమాచారం. తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) బీఆర్ఎస్ వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటుగా ఆయన కోడలు జడ్పీ చైర్ పర్సన్ అయిన తీగల అనితా రెడ్డి కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నట్లు సమాచారం..