– తెలంగాణ బీజేపీలో టికెట్ల లొల్లి
– ఫస్ట్ లిస్ట్ తో బయటపడ్డ అసంతృప్తి సెగలు
– రెండో జాబితాపై ఫోకస్ పెట్టిన అధిష్టానం
– అసంతృప్తులను బుజ్జగించే పనిలో కీలక నేతలు
– ఎన్నికల ప్రచారం ముమ్మరం
– రాష్ట్రానికి అగ్ర నేతల రాక
– 27న అమిత్ షా, 28న హిమంత శర్మ, 31న యోగి
– 15పైగా సభల్లో పాల్గొననున్న షా, నడ్డా
తెలంగాణ (Telangana) లో ఈసారి పాగా వేస్తామని ధీమాగా ఉంది బీజేపీ (BJP). అధికార బీఆర్ఎస్ (BRS) ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. కాంగ్రెస్ (Congress) కు ఓటేసినా కారు గుర్తుకు వేసినా ఒకటేనని జనానికి తెగ నూరిపోస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని చెబుతోంది. ఇదే క్రమంలో అభ్యర్థుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే 52 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. రెండో లిస్ట్ కోసం తెగ కష్టపడుతోంది. ఫస్ట్ లిస్టుతో పార్టీలో చెలరేగిన చిచ్చును చల్లార్చుతూనే.. ఇంకోవైపు అగ్ర నేతలను వరుసగా రాష్ట్రానికి తీసుకొస్తోంది.
ఎంతో కసరత్తు చేసి తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. కానీ, ఈ జాబితా పార్టీలో అసంతృప్తి చిచ్చు రగిలించింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా టికెట్ ఆశించి భంగపడ్డ చాలా మంది నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరైతే మీడియా ముందుకొచ్చి కన్నీరు మున్నీరవుతున్నారు. మరికొందరు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమౌతున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. అందుకే, సెకెండ్ లిస్ట్ లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది అధిష్టానం.
మరోవైపు, ఎన్నికల ప్రచారంపై మరింత ఫోకస్ పెట్టింది బీజేపీ. 119 నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే రాష్ట్రంలో 5 బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈనెల 27న అమిత్‌షా సభ జరగనుంది. 15పైగా సభల్లో అమిత్ షా, జేపీ నడ్డాలు పాల్గొననున్నారు. 28, 29 తేదీల్లో అసోం సీఎం హిమంత బిస్వ శర్మ ప్రచారం జరుపుతారు. 31న తెలంగాణలో యూపీ సీఎం యోగి ప్రచారం నిర్వహిస్తారు. యడ్యూరప్ప, దేవేంద్ర పడ్నవిస్, అర్జున్ ముండా, చిరాగ్ పాశ్వాన్, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. అగ్ర నేతల పర్యటన కోసం బీజేపీ నాలుగు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక అమిత్ షా రాష్ట్రానికి రావడం ఇది రెండో సారి. ఇంతకుముందు అదిలాబాద్ లో పర్యటించారు. అలాగే, ప్రధాని మోడీ రెండు సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉన్న తక్కువ టైమ్ లో వీలైనన్ని సభలు ఏర్పాటు చేసి జనాన్ని ఆకర్షించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇక, రెండు మూడు రోజుల్లో సెకండ్ లిస్ట్ ను కూడా విడుదల చేయాలని చూస్తోంది. మొత్తానికి అసంతృప్త సెగలను తగ్గిస్తూనే.. ఇంకోవైపు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని చూస్తోంది బీజేపీ.