తెలంగాణ (Telangana) లో విపక్ష బీఆర్ఎస్ కి ప్రమాద ఘంటికలు మోగడం షురూ అయ్యాయనే సంకేతాలు వస్తున్నాయి. ఒక వైపు గులాబీ అగ్ర నాయకులు, రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పరిపాలన చేత కావడం లేదని, వందరోజుల్లోగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి చూపించకపోతే.. ప్రభుత్వాన్ని బొంద పెట్టి తీరుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ (KTR) పోయే వాళ్లు వెళ్లిపోండి మేం కొత్త లీడర్స్ ను తయారు చేసుకుంటామని గంభీరమైన ప్రకటన చేశారు..
ఓటమిని జీర్ణించుకోవడం కన్నా.. ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలనే ఆరాటంలో గులాబీ అగ్రనాయకులు ఉన్నట్లుగా వీరి వాలకం చూసిన వారు చర్చించుకొంటున్నారు.. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు సొంత క్యాడర్ ని నిర్లక్ష్యం చేసి.. వలస వచ్చిన నేతలకు పట్టం కట్టారనే ఆరోపణలున్నాయి. అదీగాక తెలంగాణలో మరో పార్టీ ఉండకూడదన్న లక్ష్యంతో సొంత క్యాడర్ ను డెవలప్ చేసుకోవడం కన్నా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం మీదనే కేసీఆర్ (KCR), కేటీఆర్ దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు గత పదేళ్లలో ఎన్ని రంగులు మార్చారో రాష్ట్రం అంతా తెలిసిన విషయమే.. అదీగాక కాంగ్రెస్ (Congress) పార్టీ ఎల్పీని రెండు సార్లు విలీనం చేసుకున్నారు. ఎవ్వరిని వదిలిపెట్టలేదు.. అలా చేరిన వారికే పదవులు ఇచ్చారు. ఫలితంగా బీఆర్ఎస్ (BRS) క్యాడర్ ఎక్కడా గెలుపొందలేదు. వలస వచ్చిన నేతలే పార్టీ నేతలుగా చెలామణి అయ్యారు. 2018 ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గంపగుత్తగా తమలో కలిపేసుకొని, కాంగ్రెస్ ని మళ్లీ లేవలేని స్థాయికి దెబ్బకొట్టేశాం అని గులాబీదళం సంబరపడింది.
అయిదేళ్లలో ఆ పార్టీ తిరిగి కోలుకున్నదో లేదా, గులాబీ అహంకారాన్ని భరించలేక ప్రజలు ఏకైక ప్రత్యామ్నాయంగా వారినే ఎంచుకున్నారో తెలియదుగానీ.. మొత్తానికి గద్దెమీదకు వచ్చారు. 2018లో భారాస చేసిన పనికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ముందుగా మునిసిపాలిటీల మీద ఫోకస్ పెడుతూ.. ఇప్పటికే చాలా వాటిని హస్తగతం చేసుకొంది. ఇక కాంగ్రెస్ మంత్రుల మాటల్ని బట్టి.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉండవచ్చునని అనుకున్నారు. కానీ ఎప్పుడైనా సిద్దమే అనే సంకేతాలు కూడా వస్తున్నాయి.
మరోవైపు అధికారంలో ఉన్నంతకాలం అహంకారం ఇంటి అడ్రస్ గా వ్యవహరించిన గులాబీ అగ్రనేతలు.. పదవులు పొగానే సరిదిద్దుకొనే చర్యలు ఆలస్యంగా మొదలుపెట్టడం ఫలితాలను ఇస్తుందా అనే అనుమానాలు మొదలైయ్యాయి. ఇక పెద్ద బాస్ పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోవచ్చనే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మూసుకొన్న దారులను తెరవాలంటే ఇప్పట్లో సాధ్యం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. అనవసరంగా ప్రభుత్వాన్ని నిందించడం కంటే చేసిన తప్పులు సరిదిద్దుకొంటే పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు..