రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొదటిది కావడంతో.. ఆసక్తికరంగా మారింది. కాగా నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ మాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని ప్రకటించింది.
త్వరలో రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభం అవుతుందని తెలిపిన భట్టి.. గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పథకం వల్ల అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులు ఎక్కవగా లాభం పొందారన్నారు. కొండలు, గుట్టలకు సైతం రైతుబంధు అందించారని పేర్కొన్నారు.. రైతు బంధు నిబంధనలను పున సమీక్షించి నిజమైన అర్హులను గుర్తించి ఎకరాకి ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.
రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని.. ఫసల్ భీమా యోజన (Fasal Bhima Yojana) కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని పటిష్టంగా అమలు చేయబోతున్నామన్నారు. కాగా ఈ బడ్జెట్‌లో కాంగ్రెస్ సర్కారు వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు కేటాయించిందని వివరించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీముల అమలుకు ప్రభుత్వం మధ్యంతరం బడ్జెట్‌లో రూ.53,196 కోట్లు కేటాయించింది.
అయితే హామీలకు సంంధించిన విధివిధాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతోందని భట్టి తెలిపారు. ఆ పని పూర్తి అయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభం అయ్యాయి. భట్టి విక్రమార్క 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 లక్షల కోట్ల ప్రతిపాదనలతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవిన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూల ధన వ్యయం రూ.29,669 కోట్లుగా బడ్జెట్‌లో పొందుపరిచారు.