ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పది రోజుల పాటు తెలంగాణ (Telangana)కు బైబై చెప్పనున్నారు. పార్టీ వ్యవహారాల నిమిత్తం ఢిల్లీ (Delhi) వెళ్లిన ఆయన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్ళి రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటారు.
అనంతరం ఢిల్లీకి చేరుకొని నేరుగా స్విట్జర్లాండ్ (Switzerland), దావోస్ (Davos)లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరవుతారు. ఈమేరకు నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి మరో మూడు రోజులు రేవంత్ లండన్‌లో పర్యటిస్తారని అధికారిక సమాచారం. మరోవైపు దావోస్‌లో ప్రతి సంవత్సరం జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు.
వారిలో భారత్ నుంచి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదాని వంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి వీరితో పాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటుంటారు. కాగా ఈ ఏడాది దావోస్ సదస్సుకు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఆయన దావోస్‌లో పర్యటిస్తారు.
సీఎం వెంట మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ సెక్రటరీలు, ఓఎస్డీ తదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత ఈ నెల 23న నగరానికి రానున్నారు. కాగా రేవంత్ రెడ్డి.. పెట్టుబడుల సాధన విషయంలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాలనే భావనలో ఉన్నట్టు టాక్.. అయితే కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ.. పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్ళడం ఆసక్తికరంగా మారింది..