ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన మార్క్ లో పాలన సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుందని అనుకుంటున్నారు.. పలు అంశాలలో కీలక నిర్ణయాలు తీసుకొంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి తాజాగా మూడు వేర్వేరు అంశాలపై వరుస రివ్యూలు నిర్వహించారు.
తొలుత వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)..అధికారులతో సమీక్ష జరిపిన రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు (Rythu Bandhu) స్కీమ్, దానికి రూపొందించిన మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధానం తదితరాలపై లోతుగా చర్చించారు.. రైతు బంధు సాయం నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకొన్నారు.
అనంతరం తెలంగాణ (Telangana) పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ తదితరాలపై చర్చలు జరిపారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోని రివ్యూ మీటింగ్‌కు హాజరుకావాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ క్రమంలో చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ మీద అధికారులతో చర్చించారు రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నదంటూ ప్రజల నుంచి ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వరకి నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని పూర్తిస్థాయిలో నియంత్రించడంపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నట్టు సమాచారం..
ఇందు కోసం నార్కోటిక్స్ వింగ్ (Narcotics Wing) పనితీరు, సాధించిన ఫలితాలు, ఎదురవుతున్న సవాళ్ళు, తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు తదితరాలపై కూడా అధికారులతో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇలా మూడు వరుస మీటింగులు ఉన్నందున సాయంత్రం వరకూ సచివాలయంలోనే రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం..