తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాల్లో వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా నేతలను చేర్చుకోవడంలో ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఊహించని విధంగా ఇక్కడి నేతలు అక్కడికి.. ఆ పార్టీ నేతలు ఈ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ గాలానికి మరో ఇద్దరు నేతలు చిక్కారు. వారే కాంగ్రెస్ కీలక నేత చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar), తెలంగాణ (Telangana) టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు (TNGO State President) మామిళ్ల రాజేందర్ ( Mamilla Rajender)..
ఈ ఇద్దరు నేతలు నేడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్.. కాంగ్రెస్‌లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల భూస్వామ్య ఆధిపత్య ధోరణి తీవ్రంగా బాధిస్తున్నాయంటూ చెరుకు సుధాకర్ విమర్శించారు.
గెలుపు గుర్రాల పేరుతో నందికంటి శ్రీధర్‌ను బలిపశువు చేశారని, బీసీలకు ఇంతకంటే అవమానం ఏముంటుందని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గమైన నకిరేకల్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నాడని చెరుకు సుధాకర్ ఆరోపించారు. తనకు సమాచారం ఇవ్వకుండా వేముల వీరేశాన్ని అభ్యర్థిగా ప్రకటించారని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క సాక్షిగా నకిరేకల్ గడ్డపై తనను మాట్లాడనీయకుండా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మనుషులు అడ్డుకున్న విషయం అక్కడి ప్రజలు మర్చిపోలేదని చెరుకు సుధాకర్ తెలిపారు..