అసెంబ్లీ ఎన్నికలు(Telangana Elections) దగ్గర పడుతున్నాయి. ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం 80ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad), ఇతర అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో వివిధ సంస్థలతో కలిసి అధికారులు ఓటింగ్ క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో హోమ్ ఓటింగ్‌కు మొత్తం 966 దరఖాస్తులు రాగా అందులో 838 మంది హోమ్ ఓటింగ్‌కు అర్హులుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. కాగా ఈ హోం ఓటింగ్ కార్యక్రమం ఈనెల 27 వరకు సాగనుంది. హోమ్ ఓటింగ్ చేయనున్న 838 ఓటర్లు సోమవారం నుంచి హైదరాబాద్ జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రారంభం కాగా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మంగళవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా 28,057 మంది ఈసారి ఎన్నికల్లో 119 నియోజక వర్గాలకు కలిపి మొత్తం 28,057 మంది తమ ఓటు హక్కును ఇంట్లో నుంచే వినియోగించుకోనున్నారు. ఈ ప్రక్రియ కొరకు మొత్తం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 28,057 మందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో 26 మంది (వికలాంగులు,వృద్ధులు) జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సమక్షంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 838 మందికి హోమ్ ఓటింగ్ కు అర్వోలు నుంచి పోస్టల్ బ్యాలెట్‌లు అందాయి. ఓటరు అధికారులు వచ్చినప్పుడు ఇంట్లో లేని పక్షంలో రెండోసారి ఓటరు సమయం తెలుసుకొని ఆ సమయం ప్రకారం అధికారులు వెళ్లి ఓటింగ్ చేయిస్తారు.
దివ్యాంగులు, వయోవృద్ధులు, కొవిడ్ రోగులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఫారం-12డిద్వారా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఐదు రోజులు దరఖాస్తులు స్వీకరించారు. ఎన్నికల సంఘం నూతనంగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానంతో పోలింగ్ బూత్‌ల వద్ద కలిగే ఇబ్బందుల నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఉపశమనం లభించింది.