తెలంగాణ శాసనసభ ఎన్నికల (Telangana Elections 2023) నవంబర్ 30న జరగనున్నాయి. ఇప్పటికే ఓటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు అయిన నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు(Holiday)ను ప్రకటిస్తూ కార్మిక శాఖ(Labour Department) ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కర్మాగారాలు, సంస్థలు చట్టం-1974, తెలంగాణ దుకాణ సముదాయం చట్టం – 1988 పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది.
కార్మికులు, ఉద్యోగులు తమ ఫ్రాంచైజీని వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వరుసగా రెండు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఓటింగ్ రోజు, ఓటింగ్‌కు ఒకరోజు ముందు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
పోలింగ్ కేంద్రాలకు ఒకరోజు ముందు నుంచే ఉద్యోగులు చేరుకుంటారు. ఎన్నికల ప్రచార పర్వం ఈ నెల 28వ తేదీతో ముగియనుంది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.