Telugu News » Telangana : రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై నెలకొన్న ఉత్కంఠ.. కేబినెట్ విస్తరణపై నేతల ఆశలు..!

Telangana : రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై నెలకొన్న ఉత్కంఠ.. కేబినెట్ విస్తరణపై నేతల ఆశలు..!

పార్టీలో సీనియర్లుగా ఉంటూ పదవులు దక్కని ఎమ్మెల్యేలు ఈసారి విస్తరణలో తమకు ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు.

by Venu
Today, BRS.. Today Congress has a leader's queue.. Does CM Revanth understand the future?

*కేబినెట్ విస్తరణపై సీఎం ఫోకస్..
*మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారికి నిరాశ మిగులుతుందా..
*ఆదిలాబాద్‌ జిల్లాకు చోటు దక్కుతుందా..
*రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై నెలకొన్న ఉత్కంఠ..

పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధిస్తే కాంగ్రెస్ (Congress)కు తిరుగుండదని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) విస్తరణపై దృష్టి సారించిన సీఎం.. రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ (Delhi) వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కానున్నారని సమాచారం.. కేబినెట్ విస్తరణ లోక్‌సభ ఎన్నికలకు ముందే పూర్తి చేస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పార్టీలో సీనియర్లుగా ఉంటూ పదవులు దక్కని ఎమ్మెల్యేలు ఈసారి విస్తరణలో తమకు ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆ జిల్లాల నుంచి గెలుపొందినవారు విస్తరణలో తమకు స్థానం ఖాయమన్న భావనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని అనుకొంటున్నారు.

మరోవైపు ముగ్గురు సీనియర్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. గడ్డం వివేక్‌, గడ్డం వినోద్‌ అధిష్ఠానంతో సన్నిహితంగా ఉంటూ తామిద్దరిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఫర్వాలేదని చెప్తున్నారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు కూడా తనకు మంత్రి పదవి పక్కా అని తన అనుచరులకు చెప్తున్నట్టు సమాచారం. ఆయనకు అధిష్ఠానం వద్ద కూడా మంచి పట్టున్నది.

నిజామాబాద్‌ జిల్లా నుంచి బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌రావు కూడా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంత్రివర్గంలో స్థానం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనను మంత్రివర్గంలోకి తీసుకొంటారని, ముస్లిం మైనార్టీ కోటాలో తనకు మంత్రి పదవి పక్కా అని చెప్పుకొంటున్నట్టు తెలిసింది.

మరోవైపు కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారిలో.. సీనియర్‌ నేతలు మధుయాష్కీగౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఫిరోజ్‌ఖాన్‌, మైనంపల్లి హన్మంతరావు ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హన్మంతరావు పేరును కూడా మంత్రివర్గంలో పరిశీలించాలన్న డిమాండ్‌ ఉన్నది.

రంగారెడ్డి నుంచి కూడా మంత్రిగా ఎవరనే చర్చ సైతం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్నది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పదవి దక్కని పక్షంలో వీరిలో ఇద్దరికి కనీసం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులయినా ఇస్తారని జిల్లా కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌తో విస్తరణపై స్పష్టత రానుందని తెలుస్తోంది.

You may also like

Leave a Comment