తెలంగాణ (Telangana)లో, ఆర్టీసీ ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.. అందుబాటులోకి మరిన్ని కొత్త బస్సులు వస్తున్నాయని ఇప్పటికే టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ, సజ్జనార్ (Sajjanar) ప్రకటించించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో నేడు 80 కొత్త ఆర్టీసీ బస్సులను.. ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. మహాలక్ష్మీ పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్ లో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. మహిళ ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా అన్నీ చర్యలు తీసుకున్నామన్నారు.
నేటి ఉదయం ప్రారంభమైన కొత్తబస్సులో 30ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. మరోవైపు త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఎండీ సజ్జనార్ చెప్పారు. అందులో 500 బస్సులు హైదరాబాద్కు మరో 500 బస్సులు జిల్లాలో తిరగనున్నాయని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి 20 రోజుల్లో, రోజుకు 30లక్షల మంది ఉచిత ప్రయాణం చేస్తున్నారని వెల్లడించారు..
ఈ ఆర్థిక ఏడాది రూ.400 కోట్ల వ్యయంతో 1050 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. విడుతల వారీగా 2024 మార్చి నాటికి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు వెల్లడించారు.. ప్రజల ఇబ్బందులను, సంస్థ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు..