సనాతన ధర్మం సూత్రాల వల్ల అందరికీ సమాన అవకాశాలు లభించడం లేదని చెబుతున్న డీఎంకే ఎంపీ రాజా(DMK Raja) ఆయన పార్టీలో సమాన అవకాశాలు ఉన్నాయా అని పరిశీలించాలని పుదుచ్చేరి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. డీఎంకేలో కరుణానిధి కుటుంబ సభ్యులే ఉన్నత పదవులను అనుభవిస్తున్నారని, పార్టీలో సమానత్వం పాటించని ఆ పార్టీ నాయకులంతా సనాతన ధర్మంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
డీఎంకేలో ఉదయనిధి (Udayanidhi) కంటే దశాబ్దాల తరబడి పార్టీ కోసం పాటుపడినవారంతా సాదాసీదా పదవుల్లో మాత్రమే ఉన్నారని, వారెవరకీ మంత్రి పదవులు, పార్టీలో కీలక పదవులు గానీ ఇవ్వరని పేర్కొన్నారు.కులాలు వద్దనుకుంటే కులాలవారీగా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తున్నారంటూ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సనాతన ధర్మం పై డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ధర్మాన్ని ఎయిడ్స్(HIV), లెప్రెసీతో ఆయన పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో ఉదయనిధి పోల్చిన విషయం తెలిసిందే. ఆ ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి అన్నారు.
ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ రాజా కూడా కామెంట్ చేశారు. ఇక ఆయన ఆ ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రసీతో పోల్చడం మరింత వివాదానికి కారణం కానున్నది.