బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) గాయాలతో యశోద హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి రావద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్‌రావు తెలిపారు. ఆయనను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.
మరోవైపు కేసీఆర్ కు ఇవాళ సాయంత్రం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయనకు సర్జరీ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలపడంతో.. ఎవ్వరూ ఆస్పత్రికి రావద్దని కోరుతున్నట్టు హరీష్ రావు (Harish Rao) తెలిపారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు అన్నారు.
మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత (Kavitha) పరామర్శించారు. దురదృష్టవ శాత్తు జరిగిన ప్రమాదానికి పెద్ద శస్త్రచికిత్స అవసరమవుతుందని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో పాటు ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇక కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు.
కేసీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.. ఇప్పటికే పలువురు నేతలు, ప్రధాని మోడీ కూడా కేసీఆర్ ఆరోగ్యం విషయంలో స్పందించిన విషయం తెలిసిందే.. ఇకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందినప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో రాత్రి పొద్దు పోయిన తర్వాత కేసీఆర్ కాలు జారి పడిపోయినట్టు సమాచారం..