ఎన్నికలకు ముందు మేడిగడ్డ (Medigadda) పిల్లర్ కుంగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక రకంగా కేసీఆర్ (KCR) సర్కార్ కూలడానికి కూడా ఇదో కారణమైంది. ఈ ఇష్యూని అప్పటి విపక్షాలు బాగా క్యాష్ చేసుకున్నాయి. ఇదే క్రమంలో సంచలనం రేపిన ఈ ఘటనపై హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలైంది. సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ (Congress) నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఉన్నత న్యాయస్థానంలో ఈ పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ జరిగింది.
మహాదేవపురం పీఎస్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావడంతో డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర సీఎస్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎస్ నుంచి సమాచారం తీసుకుని వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.
ఎన్నికల సమయంలో కాక రేపిన ఈ ఘటన అంతు చూస్తామని, దీనికి కారకులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుస సమీక్షలు జరుపుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనులు చేయడమేంటని విస్తుపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే సమస్యే లేదని హెచ్చరించారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అస్త్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి జరిగాయని గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కాళేశ్వరంపై న్యాయ విచారణతో పాటు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరం నిర్మాణ సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా ఇచ్చారో.. ఇప్పుడు అదే ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి ఇవ్వాలని నిర్ణయించారు.