ఔటర్ రింగ్ రోడ్డు (ORR) టోల్ టెండర్ల (Tool Tenders) వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ. 6,500 కోట్ల రాయితీ సొమ్ము హైకోర్టు తుది తీర్పు కు లోబడే మళ్లింపు అవుతుందని హైకోర్టు వెల్లడించింది. దీనిపై వచ్చే నెల 10న పూర్తి స్థాయిలో విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది.
ఈ ఏడాది మే 28న ఓఆర్ఆర్ టోల్ వసూళ్లకు సంబంధించి గోల్కొండ ఎక్స్ ప్రెస్ వేతో హెచ్ఎండీఏ ఒప్పందం కుదుర్చుకుంది. 30 ఏండ్ల కాలానికి రూ. 7380 కోట్లకు పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాథమిక అంచనా రాయితీ విలువను ప్రకటించకుండానే రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.
ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన మహేశ్‌కుమార్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వం నిధులను మళ్లించిదని, వాటిని ఖర్చు చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.
ఈ వాదనలపై ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ అనేది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అని ఆయన అన్నారు. అదేమి ఇతర గ్రహాలకు చెందిన సంస్థ కాదని ఆయన వాదించారు. ఓఆర్‌ఆర్ టోల్ రెవెన్యూ మొత్తం ప్రభుత్వానికే చెందుతుందన్నారు. కేవలం టోల్ వసూలు చేసే బాధ్యత మాత్రమే హెచ్‌ఎండీఏకు ఉందన్నారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు మరింత గడువు కావాలని కోరారు.