తెలంగాణలో గవర్నర్(Telangana Governor)కోటాలో నియామకమైన ఎమ్మెల్సీ(MLC)లకు చుక్కెదురైంది. ఇద్దరు ఎమ్మెల్సీ నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు(High Court) కొట్టివేసింది. వారి నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా (Governor Quota MLCs) నియమించిన విషయం తెలిసిందే.
అయితే వీరి నియామకంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలంటూ సూచనలు చేసింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపింది. వీరి నియామకంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
అంతేగాక, కేబినేట్ కు తిప్పి పంపాలే తప్ప తిరస్కరించే అధికారం గవర్నర్ కు లేదని సూచించింది. అదేవిధంగా కోదండరాం, అమీర్ అలీఖాన్ లను ఎమ్మెల్సీల నియామకం చెల్లదని తేల్చి చెప్పింది. గత బీఆర్ఎస్ సర్కార్ 2023 జులై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు పంపింది. 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని తమిళిసై అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ నియామకాలు ఆపాలని పిటిషన్లో తెలిపారు. దీనిపై పిటిషనర్లు, తెలంగాణ సర్కార్, గవర్నర్ కార్యాలయం తరఫున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేస్తూ నేడు తీర్పు ఇచ్చింది.