తెలంగాణ (Telangana) రాజకీయాల్లో పోటీ రోజు రోజుకి టఫ్ గా మారుతున్న నేపధ్యంలో బీఆర్ఎస్ బాస్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. మూడో సారి అధికారం లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ (BRS)లోకి ఇప్పటికే వలస వరద జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలో బుల్లితెర పై తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకొన్న బిత్తిరి సత్తి (Bittiri Satti) అలియాస్ చేవెళ్ల రవికుమార్ ప్రగతి భవన్‌లో ఉండడం చర్చనీయాంశమైంది..
ఈ మధ్య ముదిరాజ్ (Mudiraj) మహాసభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ సభలో బిత్తిరి సత్తి రాష్ట్ర ప్రభుత్వం పై తన మ్యానరిజంతో విమర్శలు గుప్పించారు. అనంతరం ఇన్ని రోజులకి సత్తి ప్రగతి భవన్‌లో కనిపించడం చర్చకు దారి తీసింది. మరోవైపు మంత్రి కేటీఆర్ (KTR)తో బిత్తిరి సత్తి భేటీ అయినట్టు సమాచారం.
ఇలా వీరిద్దరూ ప్రగతి భవన్‌లో కలవడం పార్టీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సత్తి బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే ఆలోచనతో కేటీఆర్ ని కలిశారా.. లేక బీఆర్ఎస్ పై గుర్రుగా ఉన్న ముదిరాజ్ నుంచి ఓట్లు రాబట్టుకోవడం కోసం సత్తికి పెద్దపీట వేసే ఆలోచనతో ఈ భేటీ జరిగిందా అనేది సస్పెన్స్ లో ఉంది.
మరోవైపు బిత్తిరి సత్తితో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాట పాడించడం కోసం పిలిచినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అదీగాక ముదిరాజ్ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో బిత్తిరి సత్తిని చేరదీస్తే ఏమైనా లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతో ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నట్టు మరో సమాచారం..