పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కొందరు పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటిస్తుండగా.. మరికొందరు ఏకంగా రాజీనామాలు చేస్తూ షాకిస్తున్నారు. ఇంకొందరు అయితే మేము అసలు బీఆర్ఎస్ పార్టీ విడవడం లేదని.. ఇందులోనే కొనసాగుతాం అని ప్రకటనలు ఇస్తున్నారు.. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఎప్పుడు షాకిస్తారో అనే టెన్షన్ పార్టీలో నెలకొన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశరావు (Keshava Rao) వ్యవహారం గత రెండు రోజులుగా ఉత్కంఠంగా మారింది. ఆయన పార్టీ మారుతున్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.. ఈ క్రమంలో నిన్న బీఆర్ఎస్ (BRS) అధినేతను సైతం కలిసి చర్చించినట్లు తెలిసిందే. అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటో బయటకు రాలేదు కానీ.. కేకే మాత్రం పార్టీ మారడం ఖాయమైంది అనే సూచనలు కనిపిస్తున్నాయి..
ఈ నేపథ్యంలో కేశవరావు నేడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ అయ్యారు.. దాదాపు 30 నిమిషాల పాటు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ సైతం పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ కేశరావు కూతురు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరూ రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కుమార్తె కావ్య సైతం బీఆర్ఎస్ కు షాకిచ్చారు.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కడియం శ్రీహరి సైతం బీఆర్ఎస్ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రాజకీయ చాణక్యుడిగా చెప్పుకొనే కేసీఆర్ పార్టీ స్థాపించిన కొత్తలో అమలు చేసిన వ్యూహాలు తిరిగి ఆయనకే బెడిసికొడుతున్నాయని అనుకొంటున్నారు..