తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆడపడుచులు బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించుకొంటున్నారు. రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి అలంకరించిన స్త్రీలు, యువతులు అందమైన వస్త్రాలు ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ, బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సవాల మధ్య ఈ పండుగను జరుపుకొంటున్నారు.
బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ… ఇలా దేని ప్రత్యేకత దానిదే. ఇక తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ పండగ తెలంగాణ సంప్రదాయానికి పట్టుకొమ్మ వంటింది. కాగా పూలపండుగ.. బతుకమ్మ పండుగ.. చివరి రోజు అయిన ఆదివారం సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma)ను పురస్కరించుకొని బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు కేటీఆర్ (Minister Ktr) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆడబిడ్డలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
పుడమి పులకరించే..సింగిడి రంగుల పూల వైభవం..!
ప్రకృతి పరవశించే తీరొక్క వర్ణాల బతుకు సంబురం..!
పువ్వులు..నవ్వులు విరబూసే సహజీవన సౌందర్యం..!
ఇచ్చిపుచ్చుకునే వాయినాల ..అచ్చమైన ఆనంద పరిమళం..!
నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు..!
పండిన పచ్చని పంట చేనుల దారుల్లో పూల తేరులు..!
సమిష్టి సంస్కృతిని చాటిచెప్పే విశిష్ట వేడుక..!
స్త్రీల సృజనతో వెలిగే తెలంగాణ అస్తిత్వ ప్రతీక…!
ఆడబిడ్డలందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.