తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సభలు, సమావేశాలతో విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ (BRS) నేత,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) కాంగ్రెస్, బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో.. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను చూసి గుబులు మొదలైందని విమర్శించారు. ఏం చేయాలో అర్థం గాక రెండు పార్టీల నేతలు మతితప్పినట్టుగా మాట్లాడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రకటించిన గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బీజేపీ (BJP) ఆరితేరిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా ఉందన్న కవిత.. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా రూపొందించారని తెలిపారు. మరోవైపు రెండు పార్టీలు గ్యారెంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ను ఉద్దేశించి.. ఆరు దశాబ్ధాల పాటూ తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం క్షమాపణలు చెప్పలేరా అని ప్రశ్నించారు.
వందలాది తల్లుల కడుపుకోత పదేళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి గుర్తుకు రాకపోవడం బాధాకరం అవి వెల్లడించిన కవిత అమరవీరుల స్థూపం వద్ద మోకరిల్లినా కూడా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత ఘాటుగా విమర్శించారు.