– ‘కంట్రోల్ తప్పుతున్న కారు’ పేరుతో కథనం
– సిట్టింగ్ ఎంపీల తీరుపై వార్నింగ్
– ‘రాష్ట్ర’ చెప్పినట్టే కాంగ్రెస్ గూటికి ఎంపీ వెంకటేష్
– మరో సిట్టింగ్ ఎంపీ సోదరుడి కుమారుడు కూడా చేరిక
– ఇంకో నలుగురు ఎంపీల తీరుపై అనుమానాలు
– సైలెంట్ గా అన్నీ కానిచ్చేస్తున్న రేవంత్
– బుజ్జగింపులకు ఆస్కారం లేకుండా వ్యూహాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి కారు పార్టీ చాలా ట్రబుల్స్ ఎదుర్కొంటోంది. ఇప్పటికే అధికార పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయనే ఆందోళనలో ఉన్న గులాబీకి తాజాగా మరో షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామని ఛాలెంజ్ చేస్తున్న వేళ.. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయనతోపాటు మరో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు, పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరారు.
సిట్టింగ్ ఎంపీల తీరు అనుమానంగా ఉందని ముందే హెచ్చరించింది ‘రాష్ట్ర’. ‘కంట్రోల్ తప్పుతున్న కారు’ పేరుతో కథనాన్ని ఇచ్చింది. ‘రాష్ట్ర’ ఊహించినట్టే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎంపీలు జంప్ అవుతున్నారు. త్వరలో మరో నలుగురు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో హస్తం కండువా కప్పుకొన్నారు ఎంపీ వెంకటేష్.
ముందుగా రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం వెంకటేష్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్.. తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని ఆరాటపడుతోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ ను మారుస్తారన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో వెంకటేష్ కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం.
మొత్తానికి లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంటున్న గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగినా ఆశించిన ఫలితాలు రాబట్టుకోవడం కాస్త కష్టంగా కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. అధికారంలో ఉంటే అంతా మనవారే.. అది చేయి జారితే అంతా ఖాళీయే అనే రాజకీయ ఫార్ములా ఈ ఎన్నికల్లో రిపీట్ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని అనుకొంటున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి సైలెంట్ వ్యూహాలు గులాబీ బాస్ కు అంతుచిక్కడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేరికలపై అంతా గప్ చుప్ గా నడిపించిన రేవంత్.. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. బుజ్జగింపులకు ఆస్కారం లేకుండా ప్లాన్ చేస్తున్నారు. తాజా పరిణామాలతో పార్లమెంట్ ఎన్నికల వేళ ఇంకెంత మంది కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారు..? నెక్ట్స్ జంప్ అయ్యేది ఎవరు..? అనే ప్రశ్నలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.