తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే యోచనలో ఉంది. దీని కోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి సిద్దమైంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో గ్రామ సభలు పెట్టి ఈ ఫామ్‌లను స్వీకరిస్తున్నారు.
గ్రామాల్లో ఈ కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరగనుండగా.. గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు దరఖాస్తు చేసిన తర్వాత ఇచ్చే రసీదు జాగ్రత్తగా పెట్టుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet)లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka).. కీలక వ్యాఖ్యలు చేశారు..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని ఆరోపించారు. అందుకే ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ప్రజాపాలన అని భట్టి తెలిపారు.. గతంలో కాంగ్రెస్ (Congress) పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు.
మరోవైపు హైదరాబాద్ బంజారాహిల్స్ సీఎంటీసీలో ప్రజాపాలన ( (Praja Palana) కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 6 వరకు అర్జీల స్వీకరణ జరుగుతోందని తెలిపారు. హైదరాబాద్‌లో 600 కేంద్రాల్లో ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను సంప్రదించాలని పొన్నం వివరించారు.