తెలంగాణ (Telangana) ఎన్నికల రిజల్ట్ పై జోరుగా బెట్టింగ్ సాగుతుందనే ప్రచారం ఊపందుకుంది. అదీగాక రిజల్ట్ రాకముందే ఎగ్జిట్ పోల్స్ సంచలనాన్ని క్రియేట్ చేశాయి. రాష్ట్ర అధికారం గోడ మీది పిల్లిలా కూర్చుందని.. ఎటువైపు దూకుతుందో తెలియక తికమక పడేవారు జోరుగా చర్చలు జరుపుతున్నారని అనుకుంటున్నారు. ఈ సమయంలో తెలంగాణలో కేసీఆర్ (KCR) అవినీతి పై నడుం బిగించి పోరాటం చేశానని చెప్పుకుంటున్న వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌కు ఓ సూట్‌కేస్‌ను గిఫ్ట్‌గా తీసుకొచ్చినట్టు చెప్పిన షర్మిల.. కేసీఆర్ 2014, 2018లో ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం 45 మంది గెలిచిన నేతలను కొన్నారని ఆరోపించారు. రేపు ఫలితాలు వచ్చాక ఎవరు గెలిచినా అది ప్రజల తీర్పుగా కేసీఆర్ స్వీకరించాలని.. నేతలను కొని అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేయవద్దని షర్మిల వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అత్యధిక సీట్లు గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ ప్రజల ఎక్సాక్ట్ పల్స్ కావాలని కోరుకుంటున్నట్టు షర్మిల వెల్లడించారు. రేపటితో కేసీఆర్ అవినీతి, అక్రమ, నియంతృత్వ పాలనకు అంతిమ తీర్పు వస్తుందని షర్మిల విమర్శించారు. రాష్ట్రాన్ని 10 ఏండ్లు పాలించి ప్రజలను మోసం చేసిన కేసీఆర్.. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రి అని షర్మిల విమర్శించారు. రేపు తెలంగాణకు మరో విమోచన దినోత్సవం కావాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అవినీతి ఆసురుని పాలన అంతం కావాలని తాను కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చానని తెలిపిన షర్మిల.. ఎన్నికల బరిలో నుంచి పూర్తిగా తప్పుకుంటే.. తనకు పొలిటికల్ సూసైడ్ అవుతుంది అని తెలిసి కూడా ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసినప్పుడు.. సొంత పార్టీ నేతలే నాపై తిరుగుబాటు చేశారని, దూషించారని షర్మిల వెల్లడించారు..
ఓట్లు చీలిపోకూడదని అవమానాలు భరించానని తెలిపారు.. మరోవైపు కేసీఆర్ ప్యాకప్ చేసుకునే టైం వచ్చిందన్న షర్మిల.. చివరగా ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నామన్నారు. ‘‘తెలంగాణ పీపుల్ సే బై బై కేసీఆర్’’ అని రాసున్న సూట్ కేసును షర్మిల.. కేసీఆర్‌కు పంపించారు.