తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటువేయడానికి ఓటర్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓటర్ స్లీప్ ఇచ్చేదగ్గర ఉన్న వారు సైతం అధికార పార్టీకి ఓటు వేయమని చెబుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు.
ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని DAV స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఓటును వినియోగించుకున్న అనంతరం కవిత.. మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్కు (BRS) ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ మరచి కవిత ఇలా చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ (Telangana CEO Vikasraj) దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లారు.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి (Allola Indra Karan Reddy) తీరు వివాదాస్పదమైంది. బీఆర్ఎస్ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన ఇంద్ర కరణ్ రెడ్డి.. ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు మొదలు అయ్యాయి. నెటిజన్స్ ఆయన తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన ఓటు హక్కును ఎల్లపల్లి గ్రామంలో వినియోగించుకున్న అల్లోల.. పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుని వెళ్లడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఈనెల 28న ప్రచారం ముగియగా.. పార్టీ గుర్తులు కనిపించేలా చేయటం, ఫలనా గుర్తుకు ఓటు వేయాలని చెప్పటం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఇలా కోడ్ ఉల్లంఘనకు పాల్పడటం పట్ల ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ మొదలైంది.