కాళేశ్వరం (Kaleswaram)పై కాంగ్రెస్ (Congress) చేస్తున్న విమర్శలకు సమాధానంగా బీఆర్ఎస్ (BRS) చలో మేడిగడ్డ కార్యక్రమం మార్చి 1న నిర్వహించబోతోంది. రేపు ఉదయం హైదరాబాద్ (Hyderabad) నుంచి బయలుదేరి బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డకు చేరుకొంటుంది. మరోవైపు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ప్రజా సంఘాలు సైతం కార్యక్రమానికి పోటీగా కీలక నిర్ణయం తీసుకొన్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుమారెడ్డి రేపు ఉదయం మేడిగడ్డను సందర్శించనునట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎలా దోచుకొంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాల సాక్షిగా.. బీఆర్ఎస్ నాయకులకు కనువిప్పు కలిగేలా రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని అన్నారు.
ఈ నేపథ్యంలో మియాపూర్ భూముల కుంభకోణం, సిరీస్ భూముల కుంభకోణం, మిషన్ భగీరథ నుంచి మొదలు పెడితే, కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు ఎలా దోచుకున్నది.. ధరణి పేరుతో వేల ఏకరాల అసైన్ భూములను ఏ విధంగా దోచుకొన్నది మొదలగు మీరు చేసిన ప్రతి కుంభకోణాన్ని వివరించి చెప్పడానికి తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక మరియు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సిద్ధంగా ఉందని అన్నారు.
ఈ విషయంలో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ కూడా సిద్ధంగా ఉందని రఘుమారెడ్డి తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మరియు తెలంగాణ యువతతో కలిసి మేడిగడ్డ వెళ్తామని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ మార్చి 1న నిర్వహించ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని, బందోబస్తు కల్పించాలని ఆ పార్టీ ప్రతినిధి బృందం డీజీపీ రవిగుప్తాను కోరింది.