రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎంఐఎం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించారు.. మరోవైపు తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. అదీగాక ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మరోవైపు గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ కానుండటం విశేషం. కాగా గురువారం గడ్డం ప్రసాద్ పేరును అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించి శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు.
తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న మూడో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు శాసనసభలో సీనియర్ నేత ఎంఐఎం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించారు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ (Vikarabad) ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను.. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ.. అధికారికంగా ప్రకటించారు.. అనంతరం సీఎం, మంత్రులు, అధికార ఎమ్మెల్యేలు, విపక్ష ఎమ్మెల్యేలు, కొత్త స్పీకర్ ప్రసాద్ కుమార్ కి అభినందనలు తెలిపారు.