బీఆర్ఎస్ నర్సాపూర్ (Brs Narsapur) అభ్యర్థి ఎంపికపై గత కొద్దిరోజులుగా పార్టీలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం కేసీఆర్ ఒకేసారి 115మంది అభ్యర్థులు ప్రకటించారు. కానీ కొన్ని సీట్లను పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఈ సీట్లపైనే అసలు సిసలైన హైడ్రామా నడిచింది. మొన్నటిదాకా జనగామ సీటు ఎవరికి ఇస్తారంటూ చర్చ నడిచింది. చివరికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సొంతం చేసుకోగా జనగామ సీటులాగానే నర్సాపూర్ అభ్యర్థి ఎంపికపై కూడా తీవ్ర ఉత్కంఠ సాగింది.
ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఇస్తారా? లేదంటే సునీత లక్ష్మారెడ్డికి ఇస్తారా? అన్న ఆసక్తి చోటుచేసుకుంది. తీవ్ర కసరత్తు తర్వాత నర్సాపూర్ సీటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి(Sunitha laxma reddy) పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీతకు కేసీఆర్ బీఫామ్ అందచేశారు.
మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొద్ది రోజులుగా నర్సాపూర్ టికెట్‌పై సాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. ఇక సునీతారెడ్డి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే ఆమె తొలుత కాంగ్రెస్ పార్టీ తరపున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పని చేశారు.
రోశయ్య మంత్రివర్గంలోనూ కొనసాగారు సునీతారెడ్డి. కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలో కేబినెట్‌లో మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమం శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సునీతా లక్ష్మారెడ్డి, 2019, ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి నియామకం అయ్యారు.