అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కార్యక్రమాలను పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే 6 గ్యారంటీల్లో కీలక మైన ఇందిరమ్మ ఇండ్ల స్కీం (Indiramma Indlu Scheme) అమలుకు సిద్దం అయ్యింది.
అయితే ఈ పథకానికి లక్షల సంఖ్యలో అప్లికేషన్లు రావటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోన్న ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జీవోను త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా భద్రాచలం నియోజకవర్గం, బూర్గంపాడ్లో మార్చి 11న నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి సంబధించిన గైడ్ లైన్స్ ప్రారంభించనున్నారు.
ఈ సభలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీం అమలు, లబ్ధిదారుడి ఎంపిక, దశల వారీగా ఫండ్స్ రిలీజ్, స్కీం అర్హత వంటి తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందచేసినట్లు తెలుస్తోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైనల్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లను తొలి దశలో సొంత జాగాలు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు అందించననున్నారని తెలుస్తోంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 70 గజాల జాగాలో 400 SFT లో, బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటి ప్లాన్ డిజైన్ చేసి ప్రభుత్వానికి అందచేశారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూం తీసుకొన్న వాళ్లు దీనికి అనర్హులని అధికారులు పేర్కొన్నారు.
అదేవిధంగా సొంత జాగా ఉన్న వాళ్ల కు రూ.5 లక్షలను అందించనున్నారు. కానీ ఒక్కో దశలో రూ.1.25 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీంకు మొత్తం 82 లక్షల అప్లికేషన్లు రాగా.. గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ లు లబ్ది పొందినవారు 18 లక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.