రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS)పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. 4 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ప్రకటించారు. వారిలో కొప్పుల ఈశ్వర్, బి. వినోద్ కుమార్, నామ నాగేశ్వర్ రావు, మాలోత్ కవిత ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకొన్నారు. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు.
తెలంగాణ (Telangana) భవన్‌లో నేడు జరిగిన సమావేశంలో కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఓటములకు కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవారమా అని నేతల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అన్న కేసీఆర్, ఎన్నో గొప్ప పనులు చేసిన ఎన్టీఆర్ (NTR) అంతటి వారికే తిప్పలు తప్పలేదని వ్యాఖ్యానించారు.
పాలనపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి అవగాహన రావడం లేదన్న ఆయన, సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుదామని పిలుపునిచ్చారు. ఏడాది, రెండో ఏడాది, ఐదేళ్లు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాబోయే కాలం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం (Khammam)లో అద్భుతమైన అభివృద్ధి చేశామని, కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామని తెలిపారు.
నేతలు కలిసికట్టుగా పని చేసి, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.. ఈ క్రమంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇక పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ (Karimnagar), బి.వినోద్ కుమార్, ఖమ్మం, నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత బీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగనున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడుతున్న వారితో మనకు ఎలాంటి నష్టం లేదని నేతలకు ధైర్యం చెప్పారు.