బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిస్తే బతుకమ్మ మీద గౌరమ్మకు బదులుగా లిక్కర్ బాటిల్ పెడతారని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కార్యాలయంలో కవిత మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి గారు మీ వయస్సు ఏంది ,మీ గౌరవం ఏంది ఎలక్షన్ల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.
జీవన్ రెడ్డికి నా రిక్వెస్ట్.. మీ స్థాయి మరచి ఇలా దిగజారి మరొక్కసారి మాట్లాడొద్దని కవిత కోరారు. మరోవైపు రాహుల్ గాంధీ కాదు.. అతను ఎలక్షన్ గాంధీ, పేపర్ టైగర్ అని విమర్శించిన కవిత.. తెలంగాణ బిడ్డల చావుకు కారణం సోనియా గాంధీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీసీ కులగణనకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు సోయి ఉండే మాట్లాడుతున్నారా? అని కవిత మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని కవిత పేర్కొన్నారు.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలన్నింటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ లో మరణించిన కార్మికుల మృత దేహాలను తొందరగా వారి కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాటు చేస్తున్నామని కవిత తెలిపారు. గల్ఫ్ లో ఉన్న సోదరులందరు తెలంగాణలో ఉపాధి అవకాలు ఎక్కువ ఉన్న విషయాన్ని గమనించగలరని.. తెలంగాణకు వాపస్ రండి అని కవిత కోరారు.