రాష్ట్రంలో నిరుద్యోగులని నిండా ముంచిందనే అపవాదు మూటగట్టుకొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ని పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ (Congress) సర్కార్ అడుగులు వేస్తోంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ వేగం పెంచింది.
అయితే టీఎస్‌పీఎస్సీ నిర్వాహణపై అనుమానాలు.. లీకేజీలు వంటి సమస్యలు ఉత్పన్నం కావడం సంచలనంగా మారింది. ఈ అంశంపై రేవంత్ రెడ్డి ఎన్నో ఆరోపణలు చేశారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్‌పీఎస్సీ పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అయితే తెరవెనుక ఏం జరిగిందో తెలియదు గాని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరో ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామాలు పంపారు.
అయితే రాజీనామాలకు, గవర్నర్ (Governor) తమిళిసై సౌందర్ రాజన్ (Tamilisai Soundar Rajan) ఇంకా ఆమోదం తెలపలేదు. ఇప్పటికి రెండు వారాలు గడుస్తున్న ఈ విషయంలో క్లారిటీ రాలేదు.. మరోవైపు రాజీనామాల ఆమోదంలో న్యాయనిపుణుల సలహా గవర్నర్ కోరినట్లు సమాచారం. రాజీనామాల అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా రాజీనామాల విషయం కొలిక్కి రాకపోవడంతో నోటిఫికేషన్ల విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతున్నట్లు ప్రభుత్వం తేల్చిచెప్పింది.
గవర్నర్ నిర్ణయం తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.. అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు, గ్రూప్ 2 పరీక్షలలో మరింత ఆలస్యం జరిగే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చే సూచనలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇక గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఎలాంటి సమాచారం లేకపోవడంతో గ్రూప్ 2 అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.