Telugu News » Telangana : నీటి కటకట.. ట్యాంకర్లతో పంటలను కాపాడే ప్రయత్నంలో అన్నదాతలు..!

Telangana : నీటి కటకట.. ట్యాంకర్లతో పంటలను కాపాడే ప్రయత్నంలో అన్నదాతలు..!

ఈ క్రమంలో పదిహేను రోజుల నుంచి రైతులు‌ నానా తంటాలు‌ పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మొగ్దుంపూర్, దుర్శేడ్ గ్రామాలైతే ట్యాంకర్ల ద్వారా‌ నీటిని తీసుకువచ్చి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

by Venu

రాష్ట్రంలో నీటి కటకటలు అప్పుడే ప్రారంభం అయ్యాయి.. దంచి కొడుతున్న ఎండలకు అడుగంటుతున్న భూగర్భ ‌జలాల వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరోవైపు‌, డెడ్ స్టోరేజికి చేరుకొన్న ప్రధాన‌ ప్రాజెక్టులు, చేతికి ‌వచ్చిన పంటలన్ని కళ్ళముందు ఎండిపోతుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు.. చివరకు అన్నదాతలు వాటర్ ట్యాంకర్ల ద్వారా‌ నీటిని తరలించి పంటని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు..

ఇదిలా ఉండగా తెలంగాణ (Telangana)కు వరప్రదాయినైన ఎల్లంపల్లి (Yellampalli) జలాశయం భానుడి భగభగలకు ఆవిరవుతోందన్న దృశ్యం కనిపిస్తోంది. అదేవిధంగా ఎత్తిపోతలు లేక కాళేశ్వరం (Kaleshwaram) జలాలు తిరిగొచ్చే దారిలేక.. దిగువ ప్రాంతాలకు‌ తాగునీళ్లు ఇవ్వలేనంటూ చేతులెత్తేస్తోంది. మరో వైపు ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు భారీగా పడిపోతుండటం వల్ల పరిస్థితులు సాగునీటి గండాన్ని మోసుకొస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే కడెం డెడ్ స్టోరేజీకి చేరువైందంటున్నారు.. అదేవిధంగా ఎండి ఎడారిగా మారుతున్న ఎల్లంపల్లి‌.. రాబోయే తాగునీటి కటకటకు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాలకు తాగు నీటి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు ఉమ్మడి ‌కరీంనగర్ (Karimnagar) జిల్లాలో రోజురోజుకి సాగునీటి‌ కష్టాలు పెరుగుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి.. ‌వరిపంట చేతికి వచ్చే సమయంలో నీరులేక పంటలు ఎండిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి..

ఈ క్రమంలో పదిహేను రోజుల నుంచి రైతులు‌ నానా తంటాలు‌ పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మొగ్దుంపూర్, దుర్శేడ్ గ్రామాలైతే ట్యాంకర్ల ద్వారా‌ నీటిని తీసుకువచ్చి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం‌ రెండు తడులు అయితే ‌పంటలు చేతికి‌ వస్తాయని తెలుపుచున్న రైతులు.. నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో‌ ఎల్ఎండి, మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి‌ చేరుకొంది.

ఎల్ఎండిలో అయితే మరో పది రోజులలో‌ డెడ్ స్టోరేజికి చేరుకునే అవకాశం ‌ఉందని అంటున్నారు.. దీంతో చేతికి వచ్చిన ‌పంట కళ్ల ముందే ఎండి పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోరుల్లో నీరు లేకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ‌ద్వారా పంటని కాపాడుకునే ‌ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టు కూడా చేతులెత్తేసిందంటున్నారు. హద్దు లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో 215 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ తాజాగా 34 టీఎంసీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో సాగు నీరు సంగతి దేవుడెరుగు, తాగునీటికి కూడా కటకటలాడాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

You may also like

Leave a Comment