ఉష్ణోగ్రతలు(Temperature) రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణుకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఉదయం తొమ్మిది గంటలు దాటినా… మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్(Hyderabad)లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అవసరమైతే తప్ప జనం బయటికి రావడంలేదు.
తెలంగాణ(Telangana)లో అత్యధికంగా మహబూబ్ నగర్‌లో 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. మెదక్ అత్యల్పంగా 14 డిగ్రీలు, పటాన్చెరులో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
అదేవిధంగా ఏపీ(AP)లో ఉదయం వేళల్లో దట్టంగా పొగ మంచు అలుముకుంటోంది. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. లంబసింగిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఘాట్ రోడ్‌లో వెళ్లే వాహనదారులు.. మార్గం కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.