తెలంగాణ(Telangana)లో పగటి ఉష్ణోగ్రతలు(Temerature) రోజురోజుకు పెరుగుతున్నాయి. వేసవికి ముందే ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవుతోంది. గురువారం టెంపరేచర్ 40డిగ్రీలకు చేరుకుంది.
గురువారం జూబ్లీహిల్స్లో 38.4, సరూర్ నగర్, చందానగర్ 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్లో 37.3, సెరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరో నాలుగు రోజుల పాటు తీవ్ర వేడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత 5 నుంచి 6 రోజుల పాటు వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెల 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 16 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి.