రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు వణికించిన చలి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే ఉదయం సమయంలో కాస్త చలిగా అనిపించినా.. మధ్యాహ్నం అయ్యే సరికి పెరిగిన వేడి వల్ల ఉక్కబోతగా అనిపిస్తోంది. అదే రాత్రి సమయంలో మిశ్రమంగా అనిపిస్తోంది. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకొంటున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఈ విషయంలో వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.. గత కొద్ది రోజులుగా దాదాపుగా అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయని వివరించారు. గత 5 రోజుల నుంచి ఖమ్మం (Khammam)లో సాధారణం కన్నా.. 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోందని, మరోవైపు హైదరాబాద్ (Hyderabad)లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటం వల్ల ఎండ తీవ్రత పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదీగాక రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ఆరంభం అయ్యాయి. ఆదిలాబాద్, రామగుండంలో సాధారణం 14 డిగ్రీల కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులను బట్టి చూస్తే రానున్న రోజులో రాష్ట్రంలో ఎండలు పెరిగే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కోస్తా, ఉత్తరాంధ్రలో కూడా ఎండలు పెరుగుతున్నాయంటున్నారు. ఏపీ (AP)లో రాత్రివేళ సాధారణ 21 డిగ్రీల సెల్సియస్ ఉందని, పగటివేళ అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అధికారులు తెలిపారు.. తెలుగు రాష్ట్రాల్లో గాలి వేగం సాధారణంగానే ఉండగా.. బంగాళాఖాతంలో గంటకు 12 నుంచి 27 కిలోమీటర్లుగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.