ఇందిరా పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగులకు మద్దతుగా ఇందిరా పార్కులో బీజేపీ 24 గంటల నిరసన దీక్షను చేపట్టింది. బీజేపీ దీక్షకు కేవలం ఆరు గంటల వరకు మాత్రమే సమయం ఉందని పోలీసులు చెబుతున్నారు. బీజేపీ మాత్రం తాము 24 గంటల దీక్షను చేసి తీరాతామని అంటున్నారు.
ఈ క్రమంలో దీక్ష స్థలం దగ్గర హైటెన్షన్ నెలకొంది. బీజేపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు చుట్టు ముట్టారు. దీంతో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ నేతలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ మాజీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాత్రూంలో మందు తాగి సీఎం కేసీఆర్ దీక్ష చేశారని ఆయన ఆరోపించారు. అలాంటివి ఏమైనా ఇప్పుడు బీజేపీ దీక్షలో జరుగుతున్నాయా అని తెలుసుకునేందుకు ఇంటలెజెన్స్ వర్గాలను ఇక్కడకు పంపారన్నారు.
తమ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేసీఆర్ లాగా మందు అలవాటు లేదన్నారు. తెలంగాణ ప్రజలు నాశనం కావాలని కామాక్య ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో మంత్రులకు అధికారాలు లేవని చెప్పారు. కేవలం సలహాదారులకే విశేష అధికారాలు వున్నాయన్నారు.