పోలీస్ అంటే ధర్మాన్ని, న్యాయాన్ని రక్షించే నాలుగో సింహం అంటారు. కానీ ఆ పదానికి కళంకం తెచ్చేలా ఉన్న కొందరి ప్రవర్తన సభ్య సమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. బ్రతికి ఉన్నవాడికి ఎలాగో విలువ ఇవ్వరు. కనీసం మరణించిన వారికి అయినా విలువిద్దాం అనే ఆలోచన కలగక పోవడం సిగ్గుచేటు అనేలా ఒక సంఘటన బిహార్‌లోని (Bihar) ముజఫర్‌పూర్ (Muzaffarpur) లో వెలుగులోకి వచ్చింది.
బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు (Police Constables) ఓ మృతదేహాన్ని (dead body) కాలువలో పడేస్తుండగా.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అదికాస్త వైరల్ అవడంతో ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో ఆ మృతదేహాన్ని మళ్లీ వెలికితీసి మార్చురీకి (Mortuary) తరలించిన అధికారులు.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించారు.
ఇక ఈ సంఘటన పై స్పందించిన జిల్లా ఎస్పీ రాకేశ్ కుమార్.. పోలీసులే అమానవీయ ఘటనకు పాల్పడటం బాధాకరం అని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు వెల్లడించారు.