యూట్యూబ్ వీడియోలు చూసి నాటు బాంబులను తయారు చేసే మహమ్మద్ షరీఖ్ (Mohammad Sharique) అనే వ్యక్తిని కర్ణాటక (Karnataka) లోని మంగుళూరు పోలీసులు పట్టుకుని ఆరెస్టు చేశారు. గత ఏడాది నవంబరు 19 న మంగుళూరు లో ప్రయాణిస్తున్న ఓ ఆటో రిక్షాలో పేలుడు సంభవించి ఆటో డ్రైవర్, మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానించారు. జాతీయ భద్రతా సంస్థ అధికారులు కూడా దీనిపై దర్యాప్తు మొదలు పెట్టారు.
ఆటోలో ఈ బాంబును పేల్చి పెను విధ్వంసం సృష్టించాలన్నది టెర్రరిస్టుల పన్నాగంగా గుర్తించారు. అగ్గిపెట్టెలు, క్రాకర్ల తయారీలో వినియోగించే పొటాషియం క్లోరేట్ ను ఈ బాంబు తయారీలోకూడా ఉపయోగించారని తెలుసుకున్నారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e -Taiba) కు చెందిన ఉగ్రవాది అఫ్సర్ పాషా .. మహమ్మద్ షరీఖ్ కి బాంబులను తయారు చేయడంలో శిక్షణ ఇప్పించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
కర్ణాటకలోని బెళగావి జైల్లో ఉన్న అఫ్సర్ పాషాను నాగ్ పూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ విషయం వెల్లడైంది. బెళగావి జైల్లో ఉండగా పాషా.. ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని వారికి ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో ట్రెయినింగ్ ఇచ్చాడట. 2020 లో మహమ్మద్ షరీఖ్ ఓ కేసులో జైలుశిక్ష అనుభవించాడు. ఈ కేసుకు సంబంధించి కొంతకాలం బెళగావి జైల్లో ఉన్నాడు.
అంటే అతనికి కూడా పాషా.. టెర్రరిస్టు కార్యకలాపాల్లో శిక్షణ ఇచ్చాడన్న విషయం స్పష్టమైంది. మొత్తానికి కర్ణాటక లోని కొన్ని జైళ్లను ఉగ్రవాదులు తమ టెర్రరిస్టు కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారని, వాటిని ‘రిక్రూట్మెంట్ స్థావరాలు’ గా మార్చుకుంటున్నారని పోలీసులు తెలుసుకున్నారు. పాషా మరికొంతమందికి కూడా ఇలాగే శిక్షణ ఇచ్చినట్టు జాతీయ భద్రతా సంస్ధ కనుగొంది.