తెలంగాణ (Telangana) హైకోర్టు (High Court)లో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ (CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ ద్వారా అప్రూవర్ దస్తగిరి (Dasthagiri)కి ప్రాణహని ఉన్నట్లు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.
మరోవైపు తాను జైల్లో ఉన్న సమయంలో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి.. ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నాడు. తన తండ్రి పైనా అవినాష్ అనుచరులు దాడి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎంపీ అవినాష్ రెడ్డి చాలా ప్రభావితమైన వ్యక్తి అని, ఆయనకు వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు.
ఇదిలా ఉండగా దస్తగిరికి ప్రాణ హాని ఉందని సీబీఐ వాదించింది.. ఇందుకు స్పందించిన హైకోర్టు.. ఆ విషయాన్ని మీరు ఎలా దృవీకరిస్తున్నారని ప్రశ్నించింది. అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీబీఐని సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సమాధానంగా బెయిల్ రద్దు చేయాలని సవాల్ చేసేలోగా వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టుకు వెళ్లిందని సీబీఐ పేర్కొంది.
దీంతో సునీత పెటిషన్‌లో కౌంటర్ దాఖలు చేశామని హైకోర్టుకు సీబీఐ వివరణ ఇచ్చింది. మరోవైపు విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రిపోర్ట్ ఇవ్వాలని నాంపల్లి కోర్టు సీబీఐకి ఆదేశాలిచ్చింది. తమకు ప్రాణాహని ఉందని దస్తగిరి భార్య, దస్తగిరి ఇద్దరూ ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇంకా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన హైకోర్టు, విట్‌నెస్ ప్రొటెక్షన్ రిపోర్ట్ వచ్చాక పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది..