కొత్త సంవత్సరం (New Year)వస్తుందంటే యువత ఆగడాలకి అదుపు ఉండదనే వాదన బలంగా ఉంది. ఒకప్పుడు నూతన సంవత్సర వేడుకలని నిర్వహించుకొనే విధానానికి.. ప్రస్తుతం చేస్తున్న పోకడలకి వ్యత్యాసం చాలా ఉందని తెలుస్తోంది. కొంత కాలం క్రితం కేవలం కూల్ డ్రింక్స్ లేదా ఆల్కహాల్ తాగుతూ సరదాగా గడిపేవారు.. కానీ నేటి ఆధునిక పోకడల వల్ల.. మనిషిని నాశనం చేయడానికి డ్రగ్స్ మానవ జీవితాల్లోకి ప్రవేశించింది.
ఒకప్పుడు బడాబాబులకి మాత్రమే అందుబాటులో ఉండే ఈ డ్రగ్.. ప్రస్తుతం విచ్చల విడిగా దొరకడం ఆందోళనకి గురి చేస్తోంది. ఈ క్రమంలో నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై రాచకొండ (Rachakonda) కమిషనర్ సుధీర్ బాబు (CP Sudheer babu) పూర్తి వివరాలు వెల్లడించారు.. కొందరు వ్యక్తులు రాజస్థాన్ నుంచి తీసుకుని వచ్చిన డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో అమ్మాలని చూస్తున్నారని తెలిపిన సుధీర్ బాబు.. ఈ ముఠా నుంచి.. ఓపియం డ్రగ్ 3.4 కేజీలు, 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్‌ను స్వాధీనం చేసుకొన్నట్టు తెలిపారు. వీటితో పాటు రూ.2.8 లక్షలు నగదు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
డ్రగ్స్ ముఠాలోని శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ నాయ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు. అయితే గతంలో కూడా శశిపాల్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిపిన సీపీ.. బస్ ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తెస్తున్నారన్నారని వివరించారు. ఇక ఇప్పటికే నగరంలో డ్రగ్స్‌ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నామని.. డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు..