Telugu News » Telangana : చెత్తకుప్పల్లో.. బాలలు..!

Telangana : చెత్తకుప్పల్లో.. బాలలు..!

ఒక్క పూట గుప్పెడు మెతుకులు దొరికితే చాలని.. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు కూడా కూలీలుగా మారుతున్నారు. అత్తాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించుకుని జీవనాన్ని సాగిస్తున్న ఇద్దరు పిల్లలకు చదువు మీద ఆసక్తి లేదా అంటే.. ఇల్లు గడవడం ఎలా సార్ అంటూ సమాధానం ఇచ్చారు.

by Venu

– కూలీలుగా మారుతున్న పిల్లలు
– పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లో చెత్త బుట్టలు
– జీహెచ్ఎంసీ పరిధిలో..
– ఇద్దరు పిల్లల దీనావస్థ
– ‘రాష్ట్ర’ స్పెషల్

ఈ ప్రపంచంలో కులం, మతం అంటనివి రెండే రెండు. ఒకటి ఆకలి. రెండు నిద్ర. వీటిని ఏ రాజకీయ నాయకుడు ఏమార్చ లేడు. మనిషి నుంచి దూరం చేయలేడు. ఒకవేళ అలా జరిగిందంటే ఆ మనిషి చివరి మజిలీ స్మశానమే అవుతుంది. ఎందుకంటే చావు తప్ప దేనికి వీటిపై హక్కు లేదన్నది నగ్న సత్యం. మరి, నేటి సమాజంలో ఇవి కూడా కరువై అలమటిస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు.

ఒక్క పూట గుప్పెడు మెతుకులు దొరికితే చాలని.. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు కూడా కూలీలుగా మారుతున్నారు. అత్తాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించుకుని జీవనాన్ని సాగిస్తున్న ఇద్దరు పిల్లలకు చదువు మీద ఆసక్తి లేదా అంటే.. ఇల్లు గడవడం ఎలా సార్ అంటూ సమాధానం ఇచ్చారు.

అర్జున్, నవీన్ అనే వీళ్ళలో అర్జున్ అనే అబ్బాయికి తల్లి చనిపోవడంతో చదువు వదిలేశాడు. తండ్రి తాగుబోతు, అవ్వ ఉంది. వీళ్ళ పోషణ తన నెత్తిన పెట్టుకున్న ఈ పిల్లాడిని “రాష్ట్ర” టీమ్ కలిసింది. ఎవరైనా చదివిస్తే చదువుకుంటావా అని ప్రశ్నించింది. అందుకు సమాధానంగా.. నేను చదువుకుంటే ఇల్లు గడవడం ఎలా సార్ అన్నాడు. ఈ పని చేయడం వల్ల 4వేలు సంపాదిస్తున్నా.. ఒకవేళ చదివిస్తామన్నోళ్లు మధ్యలో వదిలేస్తే.. నా బతుకు మళ్ళీ చెత్తలోనే కదా సార్ అని దీనంగా అన్నాడు.

వీరి గురించి మరిన్ని వివరాలు ఆరా తీస్తే చెప్పడానికి కూడా ఈ పిల్లలు ఇష్టపడలేదు. ఇంకొక అబ్బాయి నవీన్ ఫోటో తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. అయితే.. అర్జున్ పనిచేస్తున్న చెత్త బండి ఓనర్ ను అడిగితే 8897975398 అనే నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ కు కాల్ చేస్తే పిల్లలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పాడు.

ఎంతో భవిష్యత్తు ఉన్న ఇలాంటి పిల్లలను వదిలేస్తే.. చాలా ప్రమాదం. అందుకే, మనసున్న మహారాజులు వీరి జీవితాల్లో వెలుగు నింపడానికి ముందుకు వస్తే బాగుంటుందని ఆశ. లేదంటే ఇలాంటి వారు కనిపించినప్పుడు కనీస బాధ్యతగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికైనా ప్రయత్నించండి.

You may also like

Leave a Comment