రెండు వందల ఏళ్లకు పైగా బ్రిటీషర్స్ భారతదేశాన్ని పరిపాలించారని ఇప్పటికీ మనం మాట్లాడుకుంటుంటాం. చరిత్ర కూడా మనకు అదే స్పష్టం చేస్తోంది. ఆ కాలంలో తెల్లవారి ఆగడాలకు కోట్లాది భారతీయులు బలయ్యారు. బ్రిటీషర్స్ పెట్టిన నిబంధనలు, అమలు చేసిన చట్టాల గురించి ఎప్పుడైనా చదివినా, సినిమాల్లో చూసినా మనకు నెత్తురు మరిగిపోతుంటుంది. అలాంటి రోజుల్లో ప్రత్యేకంగా వారి చేతుల్లో శిక్షలు అనుభవించిన మనవాళ్ల పరిస్థితి ఏవిధంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక ఎదురుతిరిగిన వారిని కఠినంగా శిక్షించేవారు. జైల్లో పడేసేవారు. భోజనం పెట్టకుండా హింసించేవారు.లేకపోతే చంపేసేవారు. మన పూర్వీకులు అలాంటి దీనాస్థితిలో జీవనం సాగించారు.ఇక వారికి గులాములుగా ఉండేవారికి అందలం ఎక్కించేవారని కూడా తెలుసుకున్నాం.
ఇక ఆడబిడ్డలు, మహిళల విషయానికొస్తే వారు ఎదుర్కొన్న అవమానాల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడబిడ్డలను కేవలం సెక్స్ వర్కర్లుగా భావించేవారంటే అతిశయోక్తి కాదు.కనిపించిన అందమైన అమ్మాయి, మహిళలను అస్సలు వదిలేవారు కాదని, వారి రాక్షసత్వంతో వేధించి, పడక సుఖం తీర్చుకునేవారని, ఎదురు తిరిగిన వారిని కడతేర్చిన సందర్భాలూ ఉన్నాయని చరిత్ర చెబుతోంది.ఇక భారతీయ మహిళలు, ఆడబిడ్డలను అక్రమంగా బంధించి వారితో వ్యభిచార గృహాలు సైతం నడిపించారని, దీనికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని జైల్లో పడేసి చిత్రహింసలు పెట్టేవారని, లేదంటే మరణశాసనం రాసేవారని తెలిసింది.
అయితే, ఈ దారుణాలకు సంబంధించి కొన్నింటిని చరిత్ర మరుగునపడేసింది. వాస్తవం ఏమిటంటే 1800వ దశకం ప్రారంభంలో బ్రిటీష్ వారు పక్కా ప్లానింగ్‌తో కొన్ని దారుణాలకు ఒడిగట్టారు. దేశవ్యాప్తంగా 75 కంటోన్మెంట్లలో రెజిమెంటల్ ‘బ్రోతల్స్ లేదా లాల్ బజార్లు’ను ఏర్పాటు చేశారు. ఇక్కడ భారతీయ మహిళలతో బలవంతంగా పడక వృత్తి చేయించేవారు.ఇక వారిలో ఎవరైనా వ్యాధుల బారిన పడిన పడితే కంటోన్మెంట్లలో ఏర్పాటు చేసిన లాక్ ఆస్పత్రుల్లో బంధించేవారు.
ఇది చాలదన్నట్లుగా 1864లో గవర్నర్ జనరల్ వేశ్యగృహాలను అధికారికంగా స్థాపించేందుకు అనుమతించారు. అందులోనూ వేశ్యలను వర్గాలుగా విభజించారు. ఈ క్రమంలోనే అంటు వ్యాధుల చట్టం అనే శాసనాన్ని కూడా తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వ్యభిచార గృహాలను ‘చక్లాస్’ అని పిలిచేవారు. వీటిని ‘మహల్దారిని’ నడిపేది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగి తరహా నెలకు వేతనం చెల్లించేవారు.
వేశ్యగృహాలను సైనికులు, అధికారులు, కమాండర్లు కోసం ప్రత్యేకంగా విభజించారు. ఇందులో ‘గోరా చక్’లా అనేది తెల్ల సైన్యాధికారుల కోసం, ‘లాల్ కుర్తీ చక్లా’ అనేది శ్వేత పదాతి దళ ర్యాంకు వారి కోసం.. ‘కాలా చక్లా’ అనేది స్థానికంగా గస్తీ తిరిగే సైనికుల కోసం ఏర్పాటుచేశారు. ఇందులో అభాగ్యులైన మహిళలను ఉంచి వారితో వ్యభిచారం చేయించేవారు.
ఇక వ్యభిచార గృహాల్లో అంటు వ్యాధులతో ఎవరైనా లాక్ ఆస్పత్రులకు వెళితే వారి స్థానంలో కొత్తగా అమ్మాయిలు, మహిళలను తీసుకొచ్చే బాధ్యత కంటోన్మెంట్ కమాండింగ్ అధికారికి ఉంటుంది. ఇతను రెజిమెంటల్ పోలీసులతో కలిసి గ్రామాలపై దాడి చేసి 14 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పేద కుటుంబంలోని ఆడ కూతుర్లను బలవంతంగా తీసుకెళ్లేవారు. ఇలా ఒకేసారి 15మంది అమ్మాయిలను తీసుకెళ్లి వారి అందచందాలను పరిగణలోకి తీసుకుని విభజించిన చక్లాస్‌లో ఉంచేవారు. ప్రతి 1000 మంది బ్రిటిష్ వారి కోసం 12-15 మంది బాలికలను అందజేసేవారు. ఇలా వారిని అంగట్లో సరుకులా చూసేవారు.
వ్యాధులు సోకే అంతవరకు ఈ బాలికలు బ్రోతల్స్‌లో ఉంచబడుతారు. ఆ తర్వాత మళ్లీ కొత్త బ్యాచ్ (అనగా గ్రామాలపై దాడులు చేసి కన్నె పిల్లలను తీసుకురావడం) షరా మాములుగా జరుగుతూ ఉండేది. అలా వీరిని ఎడ్ల బండ్లళ్లో, రైలు బండ్లల్లో దేశ మొత్తం సరఫరా చేసేవారని తెలిసింది. ఇటువంటి మరెన్నో దారుణ ఘటనలు బ్రిటీష్ వారి హయాంలో జరిగినా వారి మీద ఎదురు తిరగాడానికి అప్పట్లో ఎవరికి ధైర్యం చాలకపోయేది. కాగా, బ్రిటీష్ వారి కాలంలో జరిగిన ఇలాంటి దారుణమైన ఘటనలు, మారణహోమాల గురించి కొన్ని మాత్రమే చరిత్రలో మిగిలిపోగా, మరికొన్ని కనుమరుగు అయ్యాయి.