సోషల్ మీడియా (Social media) వేపన్ కంటే వేగంగా వార్తను ప్రజల్లోకి తీసుకెళ్తుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కడో మారుమూలలో చిన్న సంఘటన జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదంతా సోషల్ మీడియా వల్లనే కదా.. అప్పుడప్పుడు ఇబ్బందులను సృష్టించడంలో కూడా సోషల్ మీడియా ముందుంటుంది. కాగా తాజాగా తెలంగాణ (Telangana) హోంమంత్రి మహమూద్ అలీ ( Minister Mahmood Ali) కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు.
ఇటీవల మల్‌పేటలోని ఒక స్కూల్‌లో సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని కొంతమంది మంత్రులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ తన గన్‌మెన్ (Gunmen) చెంప చెల్లుమనిపించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో ప్రతిపక్ష పార్టీలు స్పందించి మహమూద్ అలీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నాయి. అయితే ఘటనపై స్పందించిన మహమూద్ అలీ.. ఆ గన్‌మెన్ తన దగ్గర ఎప్పటినుంచో పనిచేస్తున్నాడని, తనకు కుమారుడు లాంటి వాడని వ్యాఖ్యానించారు. ప్రేమతోనే అలా కొట్టానని, ఇందులో వేరే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. పోలీసుల పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. కొందరు కావాలని ఈ సంఘటనను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు.