నేడు గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ (Congress) పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఐదు అంశాలే ఎజెండాగా కొనసాగిన సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పీఏసీలో చర్చించారు. ఈ సందర్బంగా రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పీఏసీ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ (Hyderabad).. రంగారెడ్డి (Ranga Reddy).. జిల్లాల్లో సీట్లు తగ్గడంపైనా చర్చించినట్టు సమాచారం. అదీగాక లోక్‌సభ ఎన్నికల్లో పాటించవలసిన వ్యూహాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కమిటీ తీర్మానించింది.
వీటితో పాటు ఈ నెల28న నాగ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ఫౌండేషన్ డేకు తెలంగాణ నుంచి సుమారు 50 వేల మంది పాల్గొనేలా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై సైతం చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకల గురించి, ఒక్క కాళేశ్వరం మీద 85 నుంచి 90 వేల కోట్లు ఖర్చుపెట్టి కనీసం 90 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదనే అంశంపై ఎలా ముందుకి వెళ్లాలనే అంశంపై సమాలోచన చేసినట్టు సమాచారం..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఏఐసీసీ కృతజ్ఞతలు తెలిపింది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన నేతలకు ధన్యవాదాలు తెలిపింది.