తెలంగాణ (Telangana) రాష్ట్రంలో 2024-2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమావేశం నిర్వహిస్తున్నారు. ఆదాయం, వ్యయం, నిధుల సమీకరణ, కేటాయింపులపై శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు..
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27 తేదీల్లో జరుగుతాయని, రోజుకు నాలుగు చొప్పున, మూడు రోజుల్లో శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తారని అధికారిక సమాచారం.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొత్త పథకాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు విడిగా ఇవ్వాలని అన్ని శాఖలకు, ఆర్థికశాఖ సూచించింది.
అయితే ఇప్పటికే ప్రజాదర్బర్ ఫిర్యాదులపై కేబినెట్ సబ్ కమిటీ, ధరణి పోర్టల్‌పై కోదండరెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై ఉన్నతాధికారులతో చర్చించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)తో కలిసి రెవిన్యూ, హౌజింగ్, ఐ ఆండ్ పిఆర్ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై ఆరా తీశారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ సంవత్సరం తెలంగాణ బడ్జెట్ వచ్చాక ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రానుంది. రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఏ పథకాల కింద ఏ మేరకు నిధులు వస్తాయో కేంద్ర బడ్జెట్లో స్పష్టత రానుంది. ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.