వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదు అంటారు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తోంది. మనిషి ప్రాణం గాల్లో దీపం అని అప్పుడప్పుడు ప్రమాదాలు నిరూపిస్తాయి కూడా.. ఇక్కడ జరిగిన ఘటనల గురించి తెలుసుకుంటే నిజమే కదా అనే ఆలోచన వస్తుంది. ఆదేమంటే కర్ణాటకకి (Karnataka)చెందిన 43 మంది భక్తులు కేరళ (Kerala)లోని శబరిమలకు బస్సులో బయలుదేరారు.
భక్తితో సాగుతోన్న వారి ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో కొట్టాయం (Kottayam)లోని ఎరుమేలి (Erumeli) ప్రాంతంలో ఆ బస్సు బోల్తా కొట్టింది. కాగా ఈ ప్రమాదంలో 17 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించగా, 15 మందిని కంజిరపల్లి ఆసుపత్రికి, తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ప్రమాదం జరిగిన ఘటన గురించి తెలుసుకొన్న భక్తుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా సోమవారం కేరళలోని కోజికోడ్ జిల్లా చెవాయూర్లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ బస్సుల మధ్య ద్విచక్ర వాహనం ఇరుక్కుని నలిగిపోయింది. దానిపై ప్రయాణిస్తున్న భార్యా భర్తలు ఇద్దరు మరణించారు. ప్రైవేట్ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది.