తెలంగాణ (Telangana)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం పాలైన బీఆర్ఎస్ (BRS).. ఓటమిపై నేతలు సమీక్షించుకొంటున్నారు.. ఇప్పటికే ఓటమిపై కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సైతం పార్టీ అధికారం కోల్పోవడానికి కారణాలు తెలిపారు.. తెలంగాణ భవన్ లో నేడు జరిగిన పెద్ద పల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్టాన్ని అభివృద్ధి చేసిన.. కొందరి దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని వెల్లడించారు.. అనారోగ్యం నుంచి కేసీఆర్ (KCR) కోలుకుంటున్నారని.. త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారన్నారని తెలిపిన హరీష్ రావు.. కాంగ్రెస్ (Congress)పై మండిపడ్డారు.. ప్రస్తుత ప్రభుత్వం రద్దులు వాయిదాలు అన్నట్టుగా నడుస్తోందని.. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని వెల్లడించారు.
తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీపడలేదని ఘాటుగా స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ పాలన తీరు చూస్తుంటే ఏడాదిలో ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని జోష్యం చెప్పారు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు.. ఇప్పటికి కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదు. రైతు బంధు వేయలేదు. ఇలాగైతే రైతులు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. తమ సత్తా ఏమిటో చూపిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తల సమష్టి కృషి అవసరమని గుర్తు చేశారు.. ఇందుకు అనుగుణంగా త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కిట్ మీద ఉన్న కేసీఆర్ గుర్తును చెరిపేస్తోందని.. కానీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఆయనను తొలగించలేరని పేర్కొన్నారు..