కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం.. ఇరిగేషన్‌పై లక్ష కోట్లు ఖర్చుపెట్టినా ఉపయోగం లేదని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ (Kodandaram) బీఆర్ఎస్ (BRS)పై మండిపడ్డారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న కోదండరామ్.. కేసీఆర్ (KCR) కట్టించింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 25 వేల కోట్లు స్వాహా చేశారని కోదండరామ్ ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ఎందరో పొట్ట కొట్టిందని విమర్శించిన కోదండరామ్ ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు గ్రామస్తుల దగ్గర తక్కువ డబ్బులకే భూములు గుంజుకున్నారని గుర్తు చేశారు.
గౌరవెల్లి గ్రామస్తులకు న్యాయం చేయకుండా గ్రామాన్ని ఖాళీ చేయించారని కోదండరామ్ అన్నారు. మూడో సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ ప్రజలకు గోచి కూడా మిగల్చకుండా చేస్తారని.. అప్పులు పెరిగిన కొద్ది ఆ భారాన్ని ప్రజలపై మోపి పీల్చి పిప్పి చేస్తారని కోదండరామ్ మండిపడ్డారు.. కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోదండరామ్ కోరారు..