యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంపిణీకి లైన్‌క్లియర్ అయిందని ఆనందపడ్డ బీఆర్ఎస్ (BRS)కు ఈసీ (EC) షాకిచ్చిన మ్యాటర్ వార్తల్లో వైరల్ గా మారింది. రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. కానీ, రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.. మరోవైపు ఈసీ ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సీఈఓ వికాస్ రాజాను కలిసింది. రైతుబంధు (Rythu Bandhu) అనుమతిని నోటీసులు ఇవ్వకుండా రద్దుచేయడం సరికాదని వెల్లడించింది. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపీ (RajyaSabha MP) కేశవరావు (Keshava Rao)కూడా ఈ అంశం పై స్పందించారు. రైతుబంధు గురించి మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వాలి.. కానీ రైతుల ఖాతాల్లో నగదు జమ ఎలా ఆపుతారని ప్రశ్నించారు.
రైతుబంధు అనేది ఆన్ గోయింగ్ స్కీం అని తెలిపిన కేశవరావు.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అపుతారని ప్రశ్నించారు. రాజకీయ నేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదని హితవు పలికారు. రైతుబంధు విషయంలో కాంగ్రెస్ తప్పిదం ఉన్నట్టు అనుకోవడం లేదన్న కేశవరావు.. పథకం అమలులో భాగంగా ఈసీఐతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికిప్పుడు ఈ అంశంపై కోర్టుకు వెళ్లే టైమ్ లేదని వెల్లడించిన కేశవరావు.. రేపటి వరకూ నగదు విత్ డ్రా చేయించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఒకవేళ నగదు జమ కాకుంటే రైతులు అర్థం చేసుకోవాలని.. రెండు మూడు రోజులు ఓపిక పట్టాలని కేశవరావు కోరారు..