తిరుమల(Tirumala) నడక మార్గంలో గతేడాది ఆగస్టులో చిన్నారి లక్షిత(Lakshitha) చిరుత దాడి(Leopard Attack)లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టీటీడీ(TTD) చరిత్రలోనే ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ చిరుత జాడను కనిపెట్టడానికి టీటీడీ విశ్వ ప్రయత్నాలను చేసింది. ఈ క్రమంలో నడక మార్గానికి సమీపంలో బోన్లు ఏర్పాటు చేసింది.
ఇప్పటికే బంధించిన నాల్గో చిరుతే చిన్నారి లక్షితపై దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక, ఈ ఘటన తర్వాత మొత్తం ఆరు చిరుతలను టీటీడీ-అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో బంధించారు. మరోవైపు.. లక్షితపై దాడి చేసిన చిరుతను జూపార్కులోనే సంరక్షించాలని టీటీడీ నిర్ణయించింది.
గతేడాది ఆగస్టు 11వ తేదీన చిన్నారి లక్షిత(6)పై చిరుత దాడి చేసిన విషయం విధితమే కాగా.. ఆగస్టు 28వ తేదీన నాల్గో చిరుతను బంధించారు అటవీశాఖ అధికారులు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేష్ శశికళ దంపతులు తమ కూతురు లక్షితతో కలిసి 11వ తేదీన రాత్రి 7.30 ప్రాంతంలో అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి బయల్దేరారు.
అయితే, లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం వద్దకు చేరుకొనే సరికి అకస్మాత్తుగా ఓ చిరుత చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లింది. ఊహించని ఘటనతో షాక్‌లో ఉన్న తల్లిదండ్రులు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదుచేశారు. 12వ తేదీన ఉదయం లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయానికి సమీపంలో పోలీసులకు బాలిక మృతదేహం లభ్యమైంది.